ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ
సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం.. 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్, ఆగస్టు 6 (Zindagi9news): తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం అధికారిక మెమో జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నియోజకవర్గ స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సమన్వయంతో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
లబ్ధిదారుల జాబితా ఖరారు, రేషన్ కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, కూర్చునే సౌకర్యం, మీడియా కవరేజ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తగిన సిబ్బంది నియామకం వంటి అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
