ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల వివరాలు తప్పనిసరి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
నోటీస్ బోర్డు, వెబ్సైట్లో ఫీజుల జాబితా ప్రదర్శించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులతో పాటు కఠిన చర్యలు

హైదరాబాద్, ఆగస్టు 7 (Zindagi9news): తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల విషయంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రైవేట్ పాఠశాల 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డుతో పాటు అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.
ఫీజుల వివరాలను వెల్లడించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు (DEOలు) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి, అవసరమైతే తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
తల్లిదండ్రులకు పూర్తి పారదర్శకత కల్పించడం, ఫీజుల వసూళ్లలో అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
