ఆగస్టు 15 నుంచి 2.5 లక్షల కొత్త చేయూత పింఛన్ల పంపిణీ
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం
వితంతువులు, ఒంటరి మహిళలు, నేత–గీత కార్మికులకు ప్రాధాన్యం
తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా కొత్త పింఛన్లు

హైదరాబాద్, ఆగస్టు 5 (Zindagi9News): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల కొత్త చేయూత పింఛన్లను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నారు.
కొత్త పింఛన్ల మంజూరులో వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులను కూడా కొత్త లబ్ధిదారుల జాబితాలో చేర్చి చేయూత పింఛన్లు అందించనుంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
