22ఏ భూములపై అర్హులకు అన్యాయం జరగదు: ప్రభుత్వం
కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం
22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్టు 5 (Zindagi9News): రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో అర్హులైన భూ యజమానులకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించింది.
బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మేడ్చల్–మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
వివాదాలు లేని ప్రైవేట్ భూములను 22ఏ జాబితాలో చేర్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు 22ఏకు సంబంధించిన ప్రతి దరఖాస్తు, ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించింది. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని సూచించింది.
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉన్న భూములను చట్టపరంగా సమీక్షించి అర్హత ఉన్న భూములకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రతి కేసులో భూ రికార్డులు, వాస్తవాలు, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
