వరంగల్‌లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన
ఉత్తర తెలంగాణకు అత్యాధునిక క్యాన్సర్ వైద్యం.. ఈ ఏడాది చివరికల్లా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి

వరంగల్, ఆగస్టు 4 (జిందగి9 న్యూస్):
రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు వరంగల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం 29 స్పెషాలిటీల్లో సేవలు అందుతున్నాయని, త్వరలో మరో 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రారంభిస్తామని తెలిపారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి, అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులు, సిబ్బందితో పూర్తి స్థాయిలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హన్మకొండలో ఐవీఎఫ్ సెంటర్, డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, రీజనల్ ఐ హాస్పిటల్లో ఆధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
జనగామ, నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను మరింత బలోపేతం చేస్తామని, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట, పాలకుర్తి, కమలాపూర్ ప్రాంతాల్లో మంజూరైన డయాలసిస్ కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
జిల్లా స్థాయిలోనే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆస్పత్రులపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
