జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా 1–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు

హైదరాబాద్, జులై 12 (జిందగి9న్యూస్): తెలంగాణ ప్రభుత్వం జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day–NDD) నిర్వహించనుంది. జులై 20న మాప్-అప్ డే నిర్వహించి, మొదటి రోజు మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు ఆల్బెండాజోల్ (Albendazole 400 mg) మాత్రలు అందజేయనున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వయస్సుకు అనుగుణంగా ఆల్బెండాజోల్ మాత్రలను ఒకే మోతాదుగా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేగు నులిపురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడం, రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదల, చురుకుదనం, పాఠశాల హాజరు మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 96,81,855 మంది పిల్లలకు మందులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ తదితర విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మాత్రల మోతాదు:
1–2 సంవత్సరాల పిల్లలు: అర మాత్ర (నూరి ఇవ్వాలి)
2–3 సంవత్సరాల పిల్లలు: ఒక మాత్ర (నూరి ఇవ్వాలి)
3–19 సంవత్సరాల పిల్లలు: ఒక మాత్ర (నమిలి మింగాలి)
ముఖ్య సూచనలు:
వయస్సుకు అనుగుణంగా మాత్రను నూరి లేదా నమిలి ఇవ్వాలి.
మాత్ర తీసుకున్న తర్వాత 2–3 గుక్కల నీరు తాగించాలి.
ఇంట్లో స్వయంగా ఇవ్వకుండా, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు లేదా కళాశాలల్లో అధికారుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
