రైతు వేదికల్లో విత్తన మేళాలు
జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ

హైదరాబాద్, జూన్ 22(Zindagi9news): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన మేళాలను నిర్వహించనుంది. రైతులకు ఒకే వేదికపై నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలను సరసమైన ధరలకు కొనుగోలు చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెసర, మినుము, కంది, నువ్వులు, వేరుశెనగ వంటి పంటల విత్తనాలతో పాటు వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతుల అభిరుచులు, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, హెచ్ఎంటీ సోనా వంటి ఎంపిక చేసిన సన్నరకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. విత్తన మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు విత్తనాల ఎంపిక, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ఎంపికపై కూడా రైతులకు మార్గదర్శకాలు అందించనున్నారు. విత్తన మేళాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్ రైతులకు సూచించారు. “నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది” అనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
