వావిలాల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్వో
వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన

జమ్మికుంట, జూన్ 22(Zindagi9news): జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని అన్ని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే ఫార్మసీ గదిని తనిఖీ చేసి అవసరమైన మందులను తగినంత నిల్వ ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి పీహెచ్సీ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వరుణ, డాక్టర్ శ్రవణ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ సదానందం, రజిత, కవితతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
