హుజురాబాద్ కాంగ్రెస్ అడ్డా.. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం: వొడితల ప్రణవ్

హుజురాబాద్, జూన్ 13(Zindagi9news): హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.
శనివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రతాప్ సాయి గార్డెన్లో బీఎల్ఏలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హుజురాబాద్ అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీగా, విప్‌గా ఉన్న కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ఒక్క రూపాయి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రొసీడింగ్స్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.
హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ప్రణవ్, ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని, ఎవరి మాటల్లోనూ పడరని అన్నారు.
రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొంటూ, వడ్లు, మక్కల కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే అమలు చేసిందని తెలిపారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
