‘క్యూనెట్’ కొత్త అవతారం ‘ఇగ్నైట్’.. అప్రమత్తంగా ఉండండి: సీపీ సజ్జానార్

హైదరాబాద్: వివాదాస్పద మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ ‘క్యూనెట్’ ప్రస్తుతం ‘ఇగ్నైట్’ పేరుతో భారీ ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్లు సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జానార్ హెచ్చరించారు. సుమారు రూ.5,000 కోట్ల మేర ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఇదే సంస్థ ‘గోల్డ్ క్వెస్ట్’, ‘క్వెస్ట్ నెట్’ వంటి పేర్లతో కార్యకలాపాలు నిర్వహించిందని, పేర్లు మార్చుకున్నప్పటికీ మోసపూరిత విధానాలు మాత్రం మారలేదని తెలిపారు. అధిక లాభాలు, త్వరగా ధనవంతులు అవుతారనే ఆశలు చూపిస్తూ ప్రజలను వలలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న ఈ అంతర్జాతీయ ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా భారీ ఆదాయాలు వస్తాయని, కొత్త సభ్యులను చేర్చితే అధిక కమిషన్లు లభిస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే జాగ్రత్త పడాలని, పూర్తిస్థాయి వివరాలు తెలుసుకోకుండా డబ్బులు పెట్టవద్దని సజ్జానార్ ప్రజలకు సూచించారు.
