
పంట అవశేషాల దహనం.. నల్లగా మారుతున్న ప్రకృతి..! పర్యావరణానికి ముప్పు.. స్పందించని శాఖలు.. చెట్లు కాలిపోతుంటే అధికారులు ఎక్కడ..?
వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం పంట అవశేషాలను కాల్చివేస్తున్న ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పొలాలను శుభ్రం చేసే పేరుతో రైతులు నిప్పంటిస్తుండటంతో మంటలు అదుపు తప్పి రోడ్ల పక్కన ఉన్న పచ్చని చెట్లు, పొదలు, గడ్డి భూములను సైతం దగ్ధం చేస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన ప్రకృతి నల్లటి మచ్చలతో కనిపిస్తూ పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతోంది.
పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారవంతత తగ్గిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతోంది. అంతేకాకుండా పక్షులు, చిన్న జీవులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అగ్నికి ఆహుతవుతుండటంతో జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేసవి కాలంలో ఈ మంటలు మరింత విస్తరించి పెద్ద అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు శాఖలపై ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు, పర్యావరణాన్ని కాపాడాల్సిన శాఖలు స్పందించకపోవడంతో చెట్లు కాలిపోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యతేనని, పంట అవశేషాల దహనాన్ని నియంత్రించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు. పచ్చని చెట్లు బూడిదవుతున్నా అధికారులు మౌనం వీడకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
