ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 31 (జిందగీ9న్యూస్): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
గుర్తింపు సంఘాల ఎన్నికలు పూర్తయిన అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చలు జరిపి, విలీన ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలను చేపడతామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, వారి భవిష్యత్తు భద్రత విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు.
విలీన అంశంపై కార్మికుల్లో నెలకొన్న సందేహాలను త్వరలో నివృత్తి చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
