PJTSAUలో ఏసీబీ దాడులు: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అసోసియేట్ డీన్ అరెస్ట్

హైదరాబాద్ (రాజేంద్రనగర్), ఏప్రిల్ 8: అవినీతి నిర్మూలనలో భాగంగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక దాడి నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో అగ్రానమీ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం. గోవర్ధన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారునికి చెందిన విత్తన వ్యాపార సంస్థకు లైసెన్స్ జారీ చేయడం, అలాగే భవిష్యత్తులో వ్యవసాయ శాఖ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు నిందితుడు భారీగా లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ముందుగా రూ.25,000 వసూలు చేసిన గోవర్ధన్, మిగిలిన మొత్తంలో భాగంగా బుధవారం రూ.1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
