
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ
వావిలాల గ్రామంలో విద్యార్థులతో ఆరోగ్యంపై చైతన్యం
జమ్మికుంట, ఏప్రిల్ 7 (Zindagi9News) : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైద్యాధికారి డాక్టర్ వరుణ నాయకత్వం వహించగా, గ్రామ సర్పంచ్ కొండ అర్జున్ పాల్గొన్నారు. వావిలాల గ్రామంలోని సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా “అందరి ఆరోగ్యం మన అందరి బాధ్యత”, “ఆరోగ్యపు అలవాట్లు సిరిసంపదకు తొలి మెట్లు”, “వ్యాధి నిరోధక టీకాలు పిల్లల పాలిట వరాలు”, “బాల్య వివాహాలు చట్టరీత్యా నేరాలు”, “వడదెబ్బ నుండి జాగ్రత్త”, “సురక్షిత త్రాగునీరు అవసరం”, “సిగరెట్ ఆరోగ్యానికి హానికరం” వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 12 ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలి, శారీరక మరియు మానసిక ఆరోగ్యం, వ్యాధి నివారణపై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదంతో పౌష్టికాహారం, వ్యాయామం, పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.
తక్కువ ఉప్పు వినియోగం, రోజువారీ వ్యాయామం, వ్యాధుల నివారణ చర్యలు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేపూరి సతీష్, హెల్త్ సూపర్వైజర్ అరుణ, ప్రిన్సిపాల్ సిద్దూ జర్జ్, ఫార్మాసిస్ట్ రాజశ్రీధర్ రావు, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్, అంగన్వాడీ టీచర్ రేష్మ, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
