
కరీంనగర్/యాదాద్రి భువనగిరి:
మాలి దేశంలో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు భారతీయుల ఆచూకీ కోసం కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని బతుకు దెరువు కోసం మాలి దేశంలోని రూబీ కంపెనీలో ఏడాది రోజులుగా పనిచేస్తున్న నల్లమాసు ప్రవీణ్ రెడ్డి (బండ సోమారం గ్రామం – యాదాద్రి భువనగిరి జిల్లా), కుమారాకుల రామచంద్ర (కర్నూలు జిల్లా)లను గత నెల 23న JNIM తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 15 రోజులు గడిచినా ఇప్పటికీ వారి ఆచూకీ తెలియక కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి.
కిడ్నాప్ ఘటనపై వెంటనే స్పందించాలని కోరుతూ బాధితుల కుటుంబ సభ్యులు ఈరోజు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రవీణ్ తండ్రి జంగయ్యతో పాటు, రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని… పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తెలియదు” అని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మాలి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క సమాచారం కూడా ఇవ్వకపోవడం తమ ఆందోళన మరింత పెంచుతోందని పేర్కొన్నారు.
కుటుంబాల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే చర్యల్లోకి దిగారు. భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేలా ఆదేశించారు. కిడ్నాప్ అయిన ఇద్దరు భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు మంత్రి కుటుంబాలకు హామీ ఇచ్చారు.
ప్రవీణ్, రామచంద్రలను తీవ్రవాదుల చెర నుండి విడిపించేందుకు భారత్ మాలి ప్రభుత్వం తో చర్చలు కొనసాగిస్తున్నట్టు మంత్రి బండి సంజయ్ తెలిపారు.
