
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించకుండా స్థానిక ఎన్నికల ప్రకటన చేయడాన్ని బీసీ పొలిటికల్ జెఎస్ఎస్అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర కార్యదర్శి వజ గౌని వెంకటన్న గౌడ్ మాట్లాడుతూ – “బీసీల జనాభా దామాషా ప్రకారం 42 శాతం ప్రాతినిధ్యం చట్టబద్ధంగా అమలు చేయకపోతే, ఆ స్థానిక ఎన్నికలకు బీసీలు తగిన గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూనే ఉందని, కానీ బీసీల కుల గణన, జన గణన చేయకుండా పక్కదారి పడుతున్నదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలంటే మొదటగా వారి కుల గణనను చేపట్టి, జనాభా ఆధారంగా వాటా కల్పించాలన్నారు.
“42 శాతం బీసీలకు చట్టబద్ధత కల్పించిన తరువాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ వర్గాల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదురవుతాయని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రభుత్వం అయితే బీసీల హక్కులకు భంగం కలిగించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
