
బెంగళూరు, జూన్ 4 (Zindagi9News): ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ ఘనత సాధించిన సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సన్మాన కార్యక్రమం విషాదంగా మారింది. ఒక్కసారిగా స్టేడియంలోకి భారీగా అభిమానులు దూసుకొచ్చిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే అయినా, దాదాపు 3 లక్షల మంది తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధితులకు క్షమాపణలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రతి మృతుని కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
