
కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శూన్య సాగుకు శ్రీకారం
జమ్మికుంట, మే 16: నాబార్డ్ ఆర్థిక సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట ఆధ్వర్యంలో “దుక్కి దున్నకుండా పంటల సాగు – సగుణ పునరుత్పాదక పద్ధతి” పై ప్రయోగాత్మక ప్రాజెక్ట్ శుక్రవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్ (కరీంనగర్) జయప్రకాశ్ మాట్లాడుతూ – కరీంనగర్ జిల్లా మూడు మండలాల్లోని 16 గ్రామాల్లో 25 మంది రైతుల పొలాల్లో, ఒక్కొక్కరికి 25 ఎకరాల ప్రదేశంలో ఈ శూన్య సాగు విధానంపై ప్రయోగాత్మక పరిశీలన జరగనున్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ పద్ధతులకు నాబార్డ్ ఎల్లప్పుడూ ఆర్థిక సహకారం అందిస్తుందని వివరించారు.
శ్రీనివాస్ రావు, జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి మాట్లాడుతూ – ఈ పద్ధతి నేల ఆరోగ్యానికి పునాది వలె పనిచేస్తుందని, దీని వలన రసాయనిక ఎరువుల వినియోగం తగ్గే అవకాశముందని వివరించారు.
ఆంజనేయులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ – ఈ విధానంతో సాంప్రదాయ సాగు మరియు శూన్య సాగు మధ్య తేడాలు స్పష్టంగా గమనించవచ్చునని పేర్కొన్నారు.
సగుణ పద్ధతి రూపకర్త చంద్రశేఖర్ బట్సాలె గూగుల్ మీట్ ద్వారా అనుభవాలను పంచుకోగా, ఎం.వి. రావు తెలుగులో అనువదించి వివరించారు.
ఎన్. వెంకటేశ్వర్ రావు, కేవికే ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ – శూన్య సాగు పద్ధతిలో నీటి వినియోగం తగ్గి, పర్యావరణానికి హానీ నివారించవచ్చని తెలిపారు.
డి. శ్రీనివాస్ రెడ్డి, సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త ఈ పద్ధతిపై కంప్యూటర్ ప్రదర్శన ద్వారా రైతులకు క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏ.డి.ఏ, కేవికే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు పాల్గొన్నారు.
