
మెదక్ జిల్లా టెక్మల్ పోలీస్ స్టేషన్ సబ్–ఇన్స్పెక్టర్ & SHO రాజేష్ లంచం కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుడు మరియు అతడి సహచరులపై టెక్మల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుకు (తరువాత లోక్ అదాలత్‌లో పరిష్కారమైనది) సంబంధించి నోటీసులు జారీ చేసేందుకు రాజేష్ రూ.30,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారుడి నుంచి లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ దాడి చేసింది. అకస్మాత్తుగా ఏసీబీ అధికారులను గమనించిన ఎస్ఐ రాజేష్, లంచం మొత్తంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఏసీబీ అధికారులు వెంటాడి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోనే అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
లంచం మొత్తం స్వాధీనం చేసుకుని, రాజేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
