సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం, బాధిత కుటుంబాలకు పరిహారంతోపాటు ఉద్యోగ భరోసా
విశాఖపట్నం, ఏప్రిల్ 30 (zindagi9news):సింహాచలం దేవస్థానంలో జరిగిన గోడ కూలిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్య అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, జిల్లాలోని ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటన వివరాలను సమీక్షించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై సమాచారం తీసుకున్నారు.
ప్రమాద ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ నియమించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
అదనంగా, బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. బాధితుల పట్ల ప్రభుత్వ మానవీయ దృక్పథంతో స్పందిస్తున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
