
పెబ్బేర్, మే 13 (zindagi9news): పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండల టౌన్ అధ్యక్షులు వనం రాములు, దిలీప్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వడ్ల కొనుగోలుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. “కల్లంలో ఉన్న ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనాలి” అనే డిమాండ్‌ను వారు స్పష్టం చేశారు.
వారాలు గడుస్తున్నా వడ్ల లారీలను ఎత్తకుండా మిల్లర్లు కుట్ర చేస్తున్నారని, బస్తాల్లో 4-5 కిలోల వడ్లను తగ్గిస్తున్నారని వారు ఆరోపించారు. మిల్లర్లపై తీవ్ర విమర్శలు గుప్పించిన వారు, ఎమ్మెల్యే రైతులకు మొదట పంట వేయమన్నారని, కానీ చివరికి నీళ్లు లేవంటూ చేతులు దులిపేశారని చెప్పారు. అయినా రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటను పండించారని వివరించారు.
“కనీసం గింజలు కొనండి మహాప్రభో!” అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సివిల్ సప్లై శాఖ 3.90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే కొనుగోలు చేయడాన్ని ఖండించారు.
“రైతు కన్నీటికి కారణమైన ఏ ప్రభుత్వమూ నిలబడలేదు” అంటూ హెచ్చరించిన నాయకులు, రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించాలని, మిగిలిన వడ్ల కొనుగోలు తక్షణమే ప్రారంభించాలనీ, లారీలు సమయానికి పంపాలనీ, మిల్లర్లు తరుగుతీయకూడదనీ డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

