
పద్మశాలి సంఘం వనసమారాధన ఘనంగా
కాకర్లలో భారీ ర్యాలీ – సహపంక్తి భోజనాలతో మహోత్సవ వాతావరణం
జూలూరుపాడు, ఆగస్టు 21 (జిందగీ 9న్యూస్) :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. గ్రామంలోని భక్తాంజనేయస్వామి దేవాలయం నుంచి శ్రీసంతాన వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలోని పాలగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే సౌండ్ సిస్టమ్, పటాకులు, ఆటపాటలు, నృత్యాలతో ర్యాలీ సందడి వాతావరణాన్ని సృష్టించింది.
వనసమారాధనలో పరిచయాలు, పలకరింపులు, యోగక్షేమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలు నిర్వహించగా చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ ఒకే చోట చేరి ఆనందభరితంగా గడిపారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు తుమ్మ నరసింహారావు మాట్లాడుతూ – పద్మశాలి కులబంధువులంతా ఐకమత్యంతో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కులబంధువులు రాజకీయంగా ఎదగాలంటే ఐక్యత అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోబ్బని సూర్యం, గ్రామ అధ్యక్షులు సోబ్బని శ్రీను, పడమటి నర్సాపురం గ్రామ అధ్యక్షులు పెంటి శ్రీను, సీనియర్ జర్నలిస్టు గుండా సత్యనారాయణ, మహిళా నాయకురాలు తుమ్మ విజయలక్ష్మితో పాటు కొండె వెంకటేశ్వర్లు, కొక్కుల సూరయ్య, కొక్కుల సంతోష్, కొండె రమేష్, సోబ్బని లాలయ్య, పోలూరి అప్పయ్య, పోలూరి మురళి, కొండె శ్రీనివాస్, దాసరి నాగయ్య, పోలూరి వెంకటప్పయ్య, కొండే సాయి, రాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
