
పుష్కర పనుల్లో నాణ్యతపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం
కాళేశ్వరం, మే 11:
పుష్కరాల సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి కాళేశ్వరం పర్యటించి, విఐపి ఘాట్, సరస్వతి మాత విగ్రహం, జ్ఞానతీర్థం, భక్తుల స్నాన ప్రదేశం, టెంట్ సిటీ వంటి ప్రాంతాలను పరిశీలించారు.

టెంట్ సిటీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రాక, బందోబస్తు ఏర్పాట్లు, అపూర్ణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించిన మంత్రి, పట్టణాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేసి 12 రోజులు పండుగ వాతావరణంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ప్రధాన సూచనలు:
- సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అలంకరించాలి.
- పిండప్రధాన భవనం పనులు పూర్తి చేయాలి.
- హారతి వీక్షణ కోసం బందోబస్తు ఏర్పాటు చేయాలి.
- తాత్కాలిక రహదారి, క్వియర్ మ్యాట్ ఏర్పాటు చేయాలి.
- బారికేడ్స్, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.
- గజ ఈతగాళ్లు, నాటు పడవలు సిద్ధంగా ఉంచాలి.
- మినిట్ టు మినిట్ షెడ్యూల్ రూపొందించాలి.
- విద్యుత్ అంతరాయం లేకుండా జెనరేటర్లు సిద్ధంగా ఉంచాలి.
- అన్నదానం, పరిశుభ్రత, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

అధికారులపై ఆగ్రహం:
వేదిక వద్ద ఆర్చి స్లాబ్ వేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత పాటించకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు:
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకటరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఆర్జెసి రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
