జమ్మికుంట, ఏప్రిల్ 21 (Zindagi9News): జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన నెల్లి వంశీ (24) అనే యువకుడు సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య స్వరూప అలియాస్ అర్చిత తీవ్రంగా గాయపడింది.
మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, వంశీ తన భార్యతో కలిసి ఓదెల మండలం గూడెం గ్రామంలోని అత్తవారింటికి కళ్యాణ లక్ష్మి దరఖాస్తు కోసం సోమవారం ఉదయం వెళ్లాడు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం (TS 02EV 9288) గుంపుల బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో, అతి వేగంగా రాంగ్ రూట్లో వచ్చిన శిఫ్ట్ డిజైర్ కారు (AP28DE3945) ఢీకొట్టింది.
ఈ ఘటనలో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య స్వరూప తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం శ్రీరామ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై వంశీ తండ్రి నెల్లి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
