పిచ్చి ప్రేలాపనలు చేస్తే పిచ్చాసుపత్రిలో చేరడం ఖాయం..
గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..
గాడ్సే కు భారతరత్న ఇవ్వాలనే రకం బండి సంజయ్..
బిజెపికి పాట పాడిన వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తారా..?
గద్దర్ ను ఆలింగం చేసుకున్నప్పుడు
ఆయన భావాజాలం గుర్తుకు రాలేదా..?
కార్పొరేటర్ వా కేంద్ర మంత్రివా?..
సోయిలేకుండా మాట్లాడితే ఎలా..?
కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్
కరీంనగర్, జనవరి 28:ప్రజా యుద్ధనౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ ను ఆ పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావ్ డిమాండ్ చేశారు. గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇయ్యమని చెప్పడానికి బండి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. నీకు గద్దరు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని పేర్కొన్నారు.
మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ నక్సలిజం ద్వారా పేదలకు భూ పంపిణీ జరగడం నువ్వు ఓర్వలేకనా.. బడుగు బలహీన వర్గాల కోసం వారు చేస్తున్న పోరాటం నువ్వు సహించలేవా.. బండి సంజయ్ అని రాజేందర్ రావు నిలదీశారు. గాంధీని చంపిన గాడ్సే కు భారతరత్న ఇవ్వాలనే రకం నీది అన్నారు. గాడ్సే బుల్లెట్లు ఛాతిలో ఉండగా చివరి నిమిషంలో కూడా హే రామ్ అంటూ తనువు చాలించిన అసలు సిసలైన హిందూ గాంధీ అని కొనియాడారు. బండి సంజయ్ నీలాగా రామున్ని, దేవున్ని, ఆలయాన్ని, ధర్మాన్ని, దీప ధూపాలను, భక్తిని, పూజలను, నైవేద్యాన్ని ఓట్ల కోసం వాడుకునే నీచ సంస్కృతి నుంచి పుట్టినాయన కాదని స్పష్టం చేశారు. హిందువులపేరిట వారి జపం చేస్తూ ఓట్లు దండుకునే రకం నీది అని మండిపడ్డారు.
బిజెపికి చెందిన బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, బిజెపి నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ నాయక్, ఓ రాజగోపాల్, మనోహర్ పారికర్, సుందర్‌లాల్ పట్వా, మురళీ మనోహర్ జోషి, మరియు అనేకమంది నేతలు సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు. ఈ దేశం, నీ సొంతం, మీ భావాజాలం సొంతం కాదు అని పేర్కొన్నారు. భిన్నమైన జాతులు, భిన్నమైన అభిప్రాయాలు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు కలది ఈ భరతమాత అని మర్చిపోయీ బండి సంజయ్ అని రాజేందర్ రావు ప్రశ్నించారు. పిచ్చి ప్రేలాపనలు చేస్తే బండి సంజయ్ పిచ్చాసుపత్రికి పోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. రోజు రోజుకు ఏమి చేస్తున్నారో, ఆయన ఏమి మాట్లాడుతున్నారో ప్రజలకే అర్థం కావడం లేదని అన్నారు.
గద్దర్ చనిపోయినప్పుడు ఆయన పోరాటాన్ని పొగుడుతూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖ విషయాన్ని బండి సంజయ్ మర్చిపోయారా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరిని కదిలించిన వ్యక్తి గద్దర్ అని, తెలంగాణ ఉద్యమంలో సంజయ్ పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాముల వారి మీద ఒట్టు వేస్తావా.. రాజ్యాంగం మీద ఒట్టు వేస్తావా.. కేంద్ర మంత్రిగా చేస్తున్న వ్యాఖ్యలు దురుద్దేశంతోనే చేస్తున్నట్లు అర్థమవుతుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా రోజుకు ఒక అంశంపై రెచ్చగొట్టడం దారుణమని, వీటి ద్వారా ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
బిజెపికి పాట పాడిన వారికి ఆ పార్టీకి జై కొట్టిన వారికే పద్మ అవార్డులు ఇస్తారా అని బండి సంజయ్ ని రాజేందర్ రావు ప్రశ్నించారు. మరి నక్సల్స్ భావజాలం నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు. సంజయ్ కార్పొరేటర్ రా.. కేంద్ర మంత్రా అని ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి భావాజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇస్తామన్నట్లు ఆయన కామెంట్లు ఉన్నాయని విమర్శించారు. నాడు పరేడ్ గ్రౌండ్ లో మోడీ మీటింగ్ కు గద్దర్ వచ్చిన విషయం బండి సంజయ్ కుమార్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. గద్దర్ పై సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన పద్మశ్రీ అవార్డులపై సంజయ్ వ్యాఖ్యలు చేసి మోడీ ప్రభుత్వాన్ని దిగజార్చారని ఆరోపించారు. గద్దర్ పై సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాడు బిజెపి నేతలు గద్దర్ ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన భావజాలం బీజేపీ నేతలకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిజెపి వారికే పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని నిలదీశారు. గద్దర్ ని అవమానించినట్లు మాట్లాడిన బండి సంజయ్ గద్దర్ కుటుంబనికి క్షమాపణ చెప్పాలని వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు.
