2027 లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం
ఆ రెండు పార్టీలు దొందు దొందే
బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు
టేకుమట్ల, జనవరి 27 : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు దొందు దొందే అని భారతీయ జనతా పార్టీ టేకుమట్ల మండల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు అన్నారు.
సోమవారం ఆయన టేకుమట్ల మండలంలోని ప్రెస్ క్లబ్ లో నాయకులతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల అభివృద్ధిని విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి సంవత్సరకాలం గడిచినా కూడా వాటిని అమలు పరచడంలో విఫలమైందన్నారు. అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేయడంలో రైతన్నలకు అన్యాయం చేసిందన్నారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని పూర్తిస్థాయిలో అమలు పరచడంలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటనలు చేశారని ప్రస్తుతం మాట తప్పడం సరైంది కాదు అన్నారు. రుణమాఫీ రైతు భరోసా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం చేయూత తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయబోయే పథకాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఏ ఒక్క పథకం కూడా అమలు జరగడం లేదన్నారు. గత బిఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో అవినీతి పాలనైందని ప్రతి పథకం అమలు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగాల కల్పనలో బిఆర్ఎస్ యువతను ఏమాత్రం పట్టించుకోలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి వార్డు సభ్యులు కౌన్సిలర్లు బిజెపి అభ్యర్థులే ఎక్కువ స్థానంలో గెలుపొందుతారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటిని చిట్ట చివరి లబ్ధిదారుకు అందే విధంగా పాలన చేస్తుందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది అన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎం ఆవాస్ యోజన ప్రధానమంత్రి జ్యోతి భీమా యోజన జీవన రక్ష బీమా యోజన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పీఎం ముద్ర యోజన జన్ ధన్ ఉజ్వల భారత్ స్వచ్ఛభారత్ మిషన్ డిజిటల్ ఇండియా మిషన్ అటల్ పెన్షన్ యోజన పంటల బీమా పథకం తదితర అనేక సంక్షేమ ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ప్రజలకు అన్ని విధాల బిజెపి ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు.
2027 లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి ,మండల నాయకులు చిట్యాల విజయ్ కుమార్, బూత్ అధ్యక్షులు సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
