జమ్మికుంట, ఏప్రిల్ 18: వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మాయమాటలతో మోసం చేస్తున్న అంతర్ జిల్లా నేరస్థుడు అల్లెపు కృష్ణను జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై శుక్రవారం రోజున ఏసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఏప్రిల్ 15 తేదీన ఉదయం 9 గంటల సమయంలో అల్లెపురెడ్డి కమలమ్మ అనే వృద్ధ మహిళ తన భర్తతో కలిసి జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్ లేనందున తిరిగి ఇంటికి వస్తుండగా కొండూరి కాంప్లెక్స్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లెపు కృష్ణ అనే వ్యక్తి అక్కడికి చేరి, “నేను కనపర్తి పంచాయతీ కార్యదర్శిని. మీకు పెన్షన్ ఇప్పిస్తా. మీ ఆధార్ కార్డుల జిరాక్స్ కావాలి” అంటూ మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆమె భర్త ఆధార్ కార్డుల కోసం ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో మహిళను ICICI బ్యాంకు వద్దకు తీసుకెళ్లిన నిందితుడు, “ఫోటో తీయాలి, బంగారం ఒంటి మీద ఉండకూడదు” అంటూ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు గొలుసు (3.5 తులాలు) తీసుకొని, రేషన్ కార్డు కోసం 40 రూపాయలు ఇస్తూ అక్కడి నుంచి పరారయ్యాడు. బంగారం విలువ సుమారు రూ.80,000 గా అంచనా.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న జమ్మికుంట పోలీసులు సీఐ వరగంటి రవి, హెడ్ కానిస్టేబుళ్లు నల్లా మోహన్, గడ్డం సదయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ ఖదీర్, వి. శ్రీకాంత్‌ల సారథ్యంలో 36 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
అల్లెపు కృష్ణపై ఇప్పటికే జమ్మికుంటలో 3, హుజురాబాద్‌లో 3, కరీంనగర్లో 10 కేసులు నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 85కిపైగా కేసులున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గతంలో రెండుసార్లు PD యాక్ట్ కింద నిందితుడు నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాడు.
జాగ్రత్తలు అవసరం:
ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచిస్తూ – గుర్తుతెలియని వ్యక్తులు “పెన్షన్ ఇప్పిస్తా”, “సంక్షేమ పథకాలు కల్పిస్తా” అంటూ వస్తే నమ్మవద్దని, వారు కోరే వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
