
వీణవంక, మే 20 (zindagi9news):వీణవంక మండల కేంద్రంలో మంగళవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “అమ్మ మాట – అంగన్వాడి బడిబాట” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ప్రాజెక్టు సిడిపిఓ సుగుణ ముఖ్య అతిథిగా హాజరై, ఇంటింటి తిరుగుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “అంగన్వాడి కేంద్రాలు తల్లులకు, ప్రీస్కూల్ పిల్లలకు ఆశాజ్యోతిలాంటివి. ఇవి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా-శిశు సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తోంది,” అని తెలిపారు.
పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం (పాలు, గ్రుడ్లు, బాలామృతం, కురుకురేలు) అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆటపాటలతో పాటు విద్యాబోధన జరిగే అంగన్వాడి కేంద్రాల్లో తల్లిదండ్రులు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీణవంక సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడి టీచర్లు అన్నపూర్ణ, వినోద, శ్రావణి, పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
