
జమ్మికుంట: వర్షాల కారణంగా పంటలు నష్టపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే— నాగంపేట గ్రామానికి చెందిన సోమల్లా హరీష్ (28) బీటెక్ చదువుకున్నప్పటికీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో చదువు మానేసి తండ్రి సదయ్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇటీవల వరుస వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు నేలపాలవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు.
ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన హరీష్ నవంబర్ 8న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి సాయంత్రం కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. పొలంలో పురుగుల మందు తాగి ఉన్న హరీష్‌ను గుర్తించి వెంటనే జమ్మికుంటలోని విజయ సాయి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 9న మధ్యాహ్నం 12.30 గంటలకు మృతి చెందాడు.తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
