డోన్: మన సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించే ఘట్టం ఇటీవల డోన్ పక్కన గల ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన రైతు మద్దయ్య తన పొలం నుంచి మూడు బాక్సుల టమోటాలను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు తన బైక్ పై ప్రయాణం చేస్తుండగా దారిలో పెట్రోల్ అయిపోయింది. అసహాయ స్థితిలో ఉన్న ఆ రైతన్నను గమనించిన స్ఫూర్తి మధు, ఎంతైనా సహాయం చేయాలని ముందుకు వచ్చాడు.
ఆటోలో ఆ రైతు పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి, అక్కడ అమ్మకం అయ్యేంతవరకు వేచి చూశాడు. అనంతరం వచ్చిన డబ్బుతో పెట్రోల్ తీసుకెళ్లి, ఆ రైతన్నను బైక్ దగ్గర దించాడు. రైతన్న తన సహాయానికి కృతజ్ఞతగా 50 రూపాయలు ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, “వద్దు సార్” అంటూ ఆ సహాయాన్ని మానవత్వంతో మాత్రమే చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రైతన్నకు గౌరవం – మనందరి బాధ్యత
రైతన్నల కష్టాన్ని గౌరవించడం మన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. “కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్న రైతన్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని మధు చెప్పాడు.
ఇలాంటి మానవత్వంతో కూడిన సంఘటనలు మన సమాజాన్ని మరింత మంచిదిగా మార్చే మార్గంలో తోడ్పడతాయి. రైతన్నలకు తోడుగా నిలిచే ప్రతి ఒక్కరికీ Zindagi9News తరఫున అభినందనలు.
– Zindagi9News స్పెషల్ స్టోరీ
