
హైదరాబాద్, జూన్ 26 (జిందగీ 9 న్యూస్):
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు బిసి కుల సంఘాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంటల కవితను వారి నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో చేపడుతున్న రైల్ రోకోకు తమ సంఘం పక్షాన పూర్తి మద్దతు ఉందని ఆయన తెలిపారు.
బిసిల రాజ్యాధికారం కోసం కవిత గత సంవత్సరం కాలంగా రాష్ట్రమంతటా పర్యటిస్తూ బిసిలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని హరిప్రసాద్ అన్నారు. కేవలం కవిత నాయకత్వంలోనే బిసి ఉద్యమం కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీ బిసిల సమస్యలను విస్మరించలేని స్థితి ఏర్పడిందని అన్నారు.
విద్య, ఉద్యోగం, రాజకీయాలలో బిసి జనాభా ఆధారంగా రిజర్వేషన్ రావడం వల్లే బహుజన సమాజం ముందుకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో బిసి నాయకుడు పోన్నం అనిల్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
