
కరీంనగర్, మే 18(zindagi9news): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, ఇప్పటి వరకూ రాష్ట్రానికి అనేక రంగాల్లో భారీగా నిధులు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. రోడ్లు, రైల్వేల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “జాతీయ రహదారుల కోసం రూ. లక్షన్నర కోట్లు, రైల్వే అభివృద్ధికి రూ. 33 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరైన సహకారం అందించకుండా విమర్శలకే పరిమితమవుతోంది,” అని మండిపడ్డారు.
గుల్జార్ హౌజ్ ప్రమాద ఘటనపై స్పందించిన బండి సంజయ్, “17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎంతో విషాదకరం. చిన్నారుల మృతి మరింత బాధ కలిగించింది. బతికినవారికి పరిహారం, మరణించినవారికి సంతాపంతోనే సరిపెట్టడం తగదు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి,” అన్నారు.
రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలు వివరించారు:
- రూ. 32,940 కోట్లు – రైల్వే అభివృద్ధికి ఇప్పటివరకు ఖర్చు
- రూ. 5,336 కోట్లు – ఈ ఆర్థిక సంవత్సరానికే కేటాయింపు
- రూ. 750 కోట్లు – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
- రూ. 350 కోట్లు – నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ
- నాచారం రైల్వే టెర్మినల్ – ఆధునికంగా నిర్మాణం పూర్తి
“ఈ అభివృద్ధి కార్యాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు కనపడకపోవడం విచారకరం. ఇకనైనా రాజకీయ విమర్శలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా,” అని బండి సంజయ్ సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
