
ఏన్కూర్ ZPTC స్థానం నుండి CPM అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు
జిందగీ 9 న్యూస్, అక్టోబర్ 07 (వైరా నియోజకవర్గ రిపోర్టర్ రామునాయక్) : ఏనుకూరు జెడ్పీటీసీ జనరల్ స్థానానికి సీపీఎం పార్టీ అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు పోటీ చేయనున్నారు. పొత్తులు లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం కలిగిన వెంకటేశ్వరరావు, SFI నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం DYFI మండల కార్యదర్శి, CITU మండల కార్యదర్శి, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు, ఆరికాయలపాడు ఉప సర్పంచ్, LIC ఏజెంట్ (చైర్మన్ క్లబ్ మెంబర్), LIC AOI వరంగల్ డివిజన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వంటి పలు బాధ్యతలు నిర్వహించారు.
ఇదే కాకుండా ప్రజాశక్తి మరియు నవతెలంగాణ పత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 1996లో సీపీఎం సభ్యత్వం తీసుకున్న ఆయన గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టనష్టాలు పడి పనిచేస్తున్నారు.
గుడ్ల వెంకటేశ్వరరావు 2013లో జన్నారం సొసైటీ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేసి కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో శ్రీరామగిరి MPTC స్థానానికి పోటీ చేసి 150 ఓట్ల తేడాతో ఓటమి చెందినా పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగించారు.
మండలంలో సీపీఎం కీలక నేతగా పేరుగాంచిన ఆయన, అన్ని వర్గాల ప్రజల్లో సానుభూతిపరుడిగా, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన గ్రామంలో రైతులకు సాగునీటి సదుపాయం, NSP కాలువల మరమ్మతులు, రోడ్లు, వీధిలైట్లు సొంత ఖర్చుతో రిపేర్ చేయించడం, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం వంటి సామాజిక సేవలు చేస్తున్నారు.
పేద ప్రజల కష్టాల్లో తోడుండే ఆయనను GVR (గుడ్ల వెంకటేశ్వరరావు) అని స్నేహపూర్వకంగా పిలుస్తారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి అని మండల ప్రజలు చెబుతున్నారు.
అలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం వల్ల మండల అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
