ఏటీఎంలలో దొంగల హల్చల్.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ యత్నం

నిజామాబాద్ : ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని దుండగులు హల్చల్ సృష్టించారు. ఒకే రోజులో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఏటీఎంలలో చోరీకి యత్నించిన ఘటనలు కలకలం రేపాయి.
నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడంతో ఆగ్రహించిన దుండగులు ఏటీఎంకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఏటీఎంలో ఉన్న సుమారు రూ.27 లక్షల నగదు పూర్తిగా దహనం అయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అదే రోజు నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీకి యత్నం జరిగింది. అక్కడ కూడా యంత్రం తెరుచుకోకపోవడంతో దుండగులు ఏటీఎంకు నిప్పంటించి పరారయ్యారు. ఆ ఏటీఎంలో దాదాపు రూ.25 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలనలు చేపట్టారు. కేసులు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.
