
హుజురాబాద్లో ఘనంగా దివ్య మహా పడిపూజ
హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో పంచకోటి సంతోష్ గురుస్వామి 18వ పడి సందర్భంగా గురువారం రాత్రి దివ్య మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కన్నన్దొరై రాజు, కే. వెంకట్రావు, ఉపేందర్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తుల సందడి మధ్య కన్నుల పండువగా జరిగింది.

అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో కాలనీ అంతా మార్మోగింది. కన్య స్వాములు పేటతుళ్లితో “స్వామి శరణం అయ్యప్ప… శరణం శరణం అయ్యప్ప” అంటూ ఆడి పాడారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పదునేట్టంబడిని సంతోష్ గురుస్వామి వెలిగించారు. అనంతరం శరణు నినాదాలతో పరిసర ప్రాంతం భక్తి వాతావరణంతో నిండిపోయింది.

రంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ దివ్య మహా పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు, నాన్ అయ్యప్పలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
