
అంబరాన్ని అంటిన అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ ‘ఇమ్మెన్స్’ వార్షికోత్సవ వేడుకలు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ‘ఇమ్మెన్స్’ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, చదువులో విజయం సాధిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

వేడుకలకు ముందు సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికలతో చదువులో రాణించి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయమని పేర్కొంటూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి డా. వి. నరేందర్ రెడ్డి చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు ముందంజలో నిలుస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను సాధన ద్వారా పట్టు సాధించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్య సాధన వైపు ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. నేటి కాలంలో నైతిక విలువలే విద్యార్థులకు నిజమైన ఖ్యాతిని తెస్తాయని పేర్కొన్నారు.
వేడుకలలో భాగంగా శివతాండవం, శ్రీకృష్ణ లీలలు, మహిషాసురమర్దిని, మరాఠా రాజు శివాజీ జీవిత చరిత్ర, తనాజీ గాథ, కథక్ రామలీల, హనుమాన్ చాలీసా విశిష్టత, ఆపరేషన్ సింధూర్, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా కలెక్టర్ బయోపిక్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

వివిధ పరీక్షలు, క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
