గండ్రపల్లి గురుకులంలో వైద్య శిబిరం నిర్వహణ

జమ్మికుంట : హుజురాబాద్ డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గండ్రపల్లి గ్రామం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో దగ్గు, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 21 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చందు మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకం అని చెప్పారు. రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పాలు, పండ్లు, గ్రుడ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు – మలేరియా, డెంగ్యూ, చికెన్ గుణ్య, టైఫాయిడు, జాండిస్ వంటి వ్యాధుల లక్షణాలు, వ్యాప్తి, జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కలిగించారు.
వెంటనే వైద్య సేవలు పొందడానికి ప్రభుత్వ దవాఖానలను సంప్రదించాలని సూచించిన డాక్టర్ చందు, వసతిగృహ వంటగది పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రిన్సిపాల్కి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ డాక్టర్ ఝాన్సీ, హెల్త్ ఎడ్యుకేటర్లు పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇందిరా, సూపర్వైజర్ కుసుమ కుమారి, పంచాయతీ కార్యదర్శి రాము, ఏఎన్ఎం మనీ, ఆశా కార్యకర్తలు సంపూర్ణ, దీపిక, పుష్పలత, ఉపాధ్యాయురాళ్లు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
