పెద్దపల్లి : అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నాశనమై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం తక్షణమే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, కనీసం మంత్రులకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
ఆదివారం పెద్దపల్లిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల దారుస్సలాంలో జరిగిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక బహిరంగ సభను కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన కార్యక్రమంగా అభివర్ణించారు. వక్ఫ్ ఆస్తులను దోచిన బడా చోర్లు ఈ సభలో పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారని విమర్శించారు.
“విషసర్పాల కంటే డేంజర్ మజ్లిస్!”
మజ్లిస్ నాయకులు విషసర్పాల కంటే ప్రమాదకరులని వ్యాఖ్యానించిన బండి సంజయ్, ముస్లిం ఓట్ల కోసం ప్రేమ నటిస్తున్నా, వాస్తవంగా వారి హక్కులను హరించేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ముసుగులో దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టిన వాస్తవాలు ప్రజల ముందుకు రావాలని అన్నారు.
వక్ఫ్ ఆస్తులపై ఘాటైన వ్యాఖ్యలు
దేశంలో సుమారు 8 లక్షల ఎకరాల వక్ఫ్ భూముల విలువ 10 లక్షల కోట్లకు పైగా ఉందని, వాటిలో సగం కన్నా ఎక్కువ దోచుకున్నవారే ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారని చెప్పారు. తమిళనాడులోని 2 వేల కోట్ల విలువైన భూములు, హర్యానా గురుద్వారాల భూములు, కేరళ క్రైస్తవ మత్స్యకారుల భూములు, లింగాయత్‌ల వ్యవసాయ భూములు కూడా వక్ఫ్ పేరుతో ఆక్రమించబడ్డాయని ఆరోపించారు.
“77 వేల ఎకరాల్లో ఒక్క గజం అయినా పేద ముస్లింలకు ఇచ్చారా?”
తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో 80 శాతం వక్ఫ్ బోర్డు, మజ్లిస్ నేతల ఆధీనంలో ఉందని, వాటిలో ఒక్క గజం అయినా పేద ముస్లింలకు కేటాయించలేదని విమర్శించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు నడిపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నవారే పేదల కోసం వాక్చాతుర్యంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
“వాస్తవాలు చెబితే హిందువుల జోక్యమా?”
వక్ఫ్ ఆస్తుల్లో హిందువుల జోక్యం అంటూ బురదజల్లే బదులు, వాస్తవాలను స్వీకరించాలని అన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో ఇతర మతాల ప్రార్థనా మందిరాల భూములను ఆక్రమించడం సరైంది కాదన్నారు.
శ్వేత పత్రం విడుదలకు సవాల్
తెలంగాణ ప్రభుత్వానికి ధైర్యముంటే… రాష్ట్రంలో వక్ఫ్ భూములపై పూర్తి సమాచారం, ఆదాయ వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాస్తవ విచారణ చేసే ధైర్యముందా? అని ప్రశ్నించారు.
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతున్నదని విమర్శించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
