జనసమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కరోనా కష్టకాలంలో సఫాయి కార్మికులు చేసిన త్యాగాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వారి కాళ్లు కడిగి సన్మానించిన దృశ్యం దేశ ప్రజల మదిలో నిలిచిపోతుందని మల్కాజిగిరి ఎంపీ వెల్లడించారు. ఆరోగ్య శాఖ శానిటైజ్ వర్కర్లకు కూడా అప్పుడు కేంద్రం గౌరవం చూపిందని గుర్తు చేశారు. అయితే, కరోనా సమయంలో మరణించిన శానిటైజ్ కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
ఎంపీ మాట్లాడుతూ, మల్కాజిగిరి పరిధిలోని సుచిత్ర ఎంఎంటిఎస్ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ పక్కన ఉండటంతో ప్రజలకు రాకపోకలు సాధ్యపడడం లేదని, అక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రితో చర్చించామని చెప్పారు. అలాగే, RUB, ROBలు లేకపోవడం వల్ల వేలాది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై రైల్వే మంత్రితో వివరంగా చర్చించి పరిష్కార హామీ పొందినట్లు తెలిపారు.
అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో వందే భారత్ ట్రెయిన్ ఆగకపోవడం బాధాకరమని, ఆ ట్రెయిన్‌ను ఆ ప్రాంతంలో ఆపాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభించబడిన నేపథ్యంలో రైళ్లు మరిన్ని స్టేషన్లలో ఆగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మల్కాజిగిరి ప్రాంతంలో చెరువులు చెత్త నీటితో కలుషితమైపోతున్నాయని, రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నందున కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా రూ.133 కోట్లు మంజూరు చేయించామని ఎంపీ తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నదే లక్ష్యమని చెప్పారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద మల్కాజిగిరిని మినీ ఇండియాగా అభివృద్ధి చేయాలని అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కలిసి కోరినట్లు తెలిపారు. పేద బస్తీల్లో మౌలిక వసతుల కోసం నేరుగా కేంద్రం నిధులు ఇవ్వాలని వినతిపెట్టినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో సిఆర్ఎఫ్ కింద రోడ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలను గెలిచిన బీజేపీ ప్రజల సమస్యలపై కృషి చేస్తోందని, రాష్ట్ర మంత్రులతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయమై ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరించవద్దని హెచ్చరించిన ఎంపీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఆ ప్రాంతంలో ఔషధ మొక్కలు విస్తరించి ఉండటం వల్ల అభివృద్ధికి అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశామని తెలిపారు. వెంటనే లేఖ జారీచేసి ప్రాజెక్టును నిలిపివేయించారు.
రాష్ట్ర బడ్జెట్‌పై స్పందించిన ఎంపీ, రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయలేరని, నూతన ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోదని, పార్టీ గతాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ భూములు, విశ్వవిద్యాలయ భూములు అమ్మి విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేయవద్దని తీవ్రంగా విమర్శించారు.
“అభివృద్ధి పేరుతో చెరువులు కలుషితమవుతున్నాయి, పార్కుల స్థలాలు ఆక్రమితమవుతున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం నిజమైన అభివృద్ధి జరగాలి. ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏర్పాటు చేయాలి కానీ, భూములను అమ్మకం ద్వారా ప్రభుత్వ ఆదాయం పొందే ప్రయత్నాలు చేయరాదు,” అని హెచ్చరించారు.
వన్యప్రాణుల సమస్యపై మాట్లాడుతూ, “మేము తప్పుడు ప్రచారం చేయడం లేదు. చెట్లు, పక్షులు, జింకలు ఉన్నాయని చూపించేందుకు సిద్ధం” అని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
