
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్లా పనిచేస్తోంది: ఈటల రాజేందర్ విమర్శలు
హన్మకొండ జిల్లా, డిసెంబర్ 13: హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్మీట్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలా కాకుండా ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మెస్సీతో ఫుట్‌బాల్ ఆడుతున్నట్టు వ్యాఖ్యానించారు.
సింగరేణిలో కార్మికుల క్వార్టర్లు బాగుచేయడానికి, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, వందల కోట్ల రూపాయలు ఫుట్‌బాల్ ఈవెంట్లకు ఖర్చు చేయడం ఉత్తర తెలంగాణ ప్రజలను విసిగిస్తోందని అన్నారు. పేదల గుడిసెలను హైడ్రా కూల్చేస్తూ, పెద్దల భూకబ్జాలపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన రైతుబంధు, మహిళలకు రూ.2500, యువతకు రూ.4000, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని, గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కమలాపూర్‌లో సతీష్ విజయంలో ప్రజల ధర్మన్యాయ భావన కనిపించిందని, కుట్రలను ఛేదించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈటల తెలిపారు. రెండో, మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బులు కాకుండా క్యారెక్టర్, కమిట్మెంట్ ఉన్న వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
