పురుగుల మందు తాగి యువకుడు మృతి
వీణవంక, జూలై 22 (జిందగీ 9 న్యూస్ ప్రతినిధి – దాట్ల శ్రీనివాస్)

వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చుక్క సదయ్య కుమారుడు ఆదిత్య (10వ తరగతి విద్యార్థి) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఆదిత్య ఇల్లందకుంట మండలంలోని గాలిపల్లిలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
జూలై 18న సెలవుల నేపథ్యంలో ఆదిత్య తన ఊరికి వచ్చాడు. ఈ క్రమంలో అతను తల్లిదండ్రులను బండి కావాలని అడిగాడు. తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామని చెప్పారు. అయితే జూలై 20వ తేదీ రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రి 11:30 గంటల సమయంలో తన తల్లికి పురుగుల మందు తాగానని చెప్పాడు.
తక్షణమే కుటుంబసభ్యులు ఆదిత్యను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జూలై 22వ తేదీ ఉదయం 11:50 గంటలకు ఆదిత్య మరణించాడు.
ఈ ఘటనపై ఆదిత్య తండ్రి చుక్క సదయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆవుల తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.
