
హైదరాబాద్, జూన్ 8: ప్రముఖ బీజేపీ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “ప్రజలకథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ వేడుక ఆదివారం శిల్పకళావేదికలో జరిగింది. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ — “కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నవారు దత్తాత్రేయ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఆయన ప్రజలతో తన అనుబంధాన్ని ఎన్నడూ కోల్పోలేదు” అని కొనియాడారు.
“హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ పదవివరకు చేసిన ప్రయాణం అసాధారణం. 40 ఏళ్లుగా మా కుటుంబ సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజకీయ భిన్నతలు ఉన్నా, వ్యక్తిగత మైత్రి విషయంలో దత్తాత్రేయ నుంచి ఎంతో నేర్చుకున్నాను” అన్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేసిన సీఎం, దత్తాత్రేయను “అజాత శత్రువు”గా అభివర్ణించారు. అటల్ బిహారీ వాజ్పేయి మాదిరిగానే పదవుల్లో లేకున్నా గౌరవం కలిగిన నేతగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
దత్తాత్రేయ జీవితం – ప్రతి రాజకీయ నేతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నది ఈ సభలో ప్రతిధ్వనించిన ముఖ్య సందేశం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
