
తెలంగాణలో అన్ని రవాణా చెక్‌పోస్టుల మూసివేతకు సీఎం ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు చెందిన అన్ని చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ డీటీవోలకు సూచనలు విడుదల చేశారు.
ఉత్తర్వుల ప్రకారం, జిల్లా రవాణా అధికారులు (డీటీవో) స్వయంగా చెక్‌పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, “చెక్‌పోస్టులు మూసివేయబడ్డాయి” అని సూచించే కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిని తక్షణమే ఉపసంహరించాలని, అక్కడ ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించి మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపరచాలని సూచించారు.
అదే విధంగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, కంప్యూటర్లు, పరికరాలు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లు వంటి అన్ని పత్రాలను సంబంధిత డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు.
వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. చెక్‌పోస్టుల మూసివేత, సిబ్బంది పునర్వినియోగం, రికార్డుల భద్రపరచడం వంటి అన్ని చర్యలపై ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక సమర్పించాలని డీటీవోలకు ఆదేశించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
