
జమ్మికుంట: తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ముగ్దం మోహినుద్దీన్ భవన్లో ఇటీవల జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సర్వేశం, తెలంగాణలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కార్మికులు పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు.
జీఎస్టీ కారణంగా చేనేత పరిశ్రమ దెబ్బతిందని పేర్కొంటూ, జీఎస్టీను రద్దు చేయాలని, అలాగే రద్దు చేసిన పాత చేనేత పథకాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నేతన్నల రుణమాఫీతో పాటు సహకార సంఘాలు, టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.
చేనేత కార్మికులకు చేతినిండా పనులు, ధరలకు అనుగుణంగా వేతనాలు, ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షల మంజూరు, నెలకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో కార్మికులను చైతన్యపరచి ఉద్యమాలు చేపడతామన్నారు.
తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన సర్వేశం, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
