
జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆర్థిక సాయం
11న హుజురాబాద్‌లో పంపిణీ కార్యక్రమం
హుజురాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచేందుకు జయన్న ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. హుజురాబాద్ మండలం సింగాపూర్‌కు చెందిన జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11న హుజురాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖాధికారి డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సాయం అందజేయనున్నారు.
హుజురాబాద్ మండలంలోని 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న సుమారు 300 మంది నిరుపేద విద్యార్థులను గుర్తించి, పరీక్షల సమయంలో రవాణా, అల్పాహారం తదితర ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.700 చొప్పున నగదు సహాయం అందించనున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు.
గత రెండేళ్లుగా జయన్న ఫౌండేషన్ విద్య మరియు వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటివరకు 4000 మందికి ఎగ్జామ్ కిట్లు, 5000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1289 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించింది. అలాగే గ్రామాల్లో 24 గంటల ఉచిత అంబులెన్స్ సేవలను కూడా అందిస్తోంది.
ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
