
జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత – రైతులు పత్తి తీసుకురావొద్దని మార్కెట్ కమిటీ విజ్ఞప్తి
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత పత్తి సంస్థ (CCI) అమలు చేస్తున్న ఎల్-1, ఎల్-2 విధానాలు, స్లాట్ బుకింగ్ వ్యవస్థ కారణంగా రైతులు–జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంది. ఈ విధానాలను రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో, అసోసియేషన్ పిలుపు మేరకు నవంబర్ 17 నుండి జమ్మికుంటలోని అన్ని జిన్నింగ్ మిల్లులు CCI కొనుగోళ్లతో పాటు ప్రైవేట్ కొనుగోళ్లను కూడా నిలిపివేయనున్నట్లు కమిటీ తెలిపింది.
ఈ నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌యార్డు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకురావొద్దని, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయొద్దని, ఇప్పటికే బుక్ చేసుకున్నవారు కూడా పత్తి అమ్మకానికి రాకూడదని స్పష్టం చేసింది.
కొనుగోళ్లు పునఃప్రారంభమైన వెంటనే పత్రికా ప్రకటన, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందిస్తామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తెలిపారు.
