జమ్మికుంటలో ఋతు పరిశుభ్రతపై మహిళలకు అవగాహన

జమ్మికుంట: అంతర్జాతీయ ఋతు శ్రావ పరిశుభ్రత దినోత్సవం మరియు యోగ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మోతుకులగూడెంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కిషోర బాలికలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, రుతు శ్రావ సమయంలో మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా బెల్లం, ఆకుకూరలు, ఖర్జూరం, పాలు, పండ్లు, పెరుగు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. అలాగే, రోజుకు ప్రతి 4-5 గంటలకోసారి సానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని ఆమె సూచించారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 5 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యాభోధకుడు ఎ. మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అరుణ, ANM సరళ, టి.బి కోఆర్డినేటర్ తిరుపతి, ఆశా కార్యకర్తలు సరిత, శైలజలు పాల్గొన్నారు.
