చిన్ననాటి స్నేహితుడికి ఆపన్న హస్తం..
స్నేహితుల తరఫున కూతురి పేరిట డిపాజిట్

జమ్మికుంట: చిన్ననాటి స్నేహితుడికి మద్దతుగా ఆపన్న హస్తం అందిస్తూ గడిచిన పాత రోజుల జ్ఞాపకాలను విలువైన సహకారంగా మార్చారు 1996-97 విద్యా సంవత్సరంలో కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు. అదే పాఠశాలలో చదువుకున్న ముత్యాల అశోక్ భార్య ముత్యాల అనిత ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆ దుఃఖ సమయంలో అతనికి అండగా ఉండేందుకు చిన్ననాటి స్నేహితులందరూ ముందుకొచ్చారు.
మిత్రుడు ముత్యాల అశోక్ కుమార్తె ముత్యం మాన్య భవిష్యత్తు కోసం రూ.20,116లను సుకన్యా సమృద్ధి పథకం కింద డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను రేగొండ మండలం నాగూర్లపల్లి గ్రామంలో నివసిస్తున్న అశోక్ కు అందజేశారు.
ఈ సేవా కార్యక్రమంలో సందీప్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, రాంబాబు, తిరుపతి, శ్రీనివాసరావు, సదానందం రాజు తదితరులు పాల్గొని తమ స్నేహ బంధాన్ని మరోసారి చాటిచెప్పారు. సహచరుల స్పందనను పలువురు అభినందించారు.
