
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన లెక్చరర్ నన్నేబోయిన శ్రీశైలం క్లాస్‌రూమ్‌లో విద్యార్థులకు హాజరు తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు.
ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సహచర ఉపాధ్యాయులు వెంటనే శ్రీశైలాన్ని హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన కళాశాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. సహచరులు, విద్యార్థులు శ్రీశైలం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
