
కరీంనగర్లో నకిలీ క్రిప్టో మోసం – మాజీ కార్పొరేటర్ అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీసులు భారీ క్రిప్టో మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను అరెస్టు చేశారు. “మెటా ఫండ్ క్రిప్టో” పేరుతో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మించి, ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సెప్టెంబర్ 11న తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం, కోతిరాంపూర్‌కు చెందిన సతీష్ తనకు పరిచయమై, రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని నమ్మించాడు. అతని మాటలు నమ్మి గత సంవత్సరం జూన్‌లో రూ.15 లక్షలు పెట్టగా, తన పరిచయస్తులైన మరో 17 మందిని కూడా ఆ స్కీమ్‌లో చేర్చాడు.
ఈ విధంగా సతీష్ మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేసి, మూడు నెలల్లో లాభాలు ఇస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు అడిగితే బెదిరించాడని కూడా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్, సీసీఎస్ సీఐ ప్రకాష్, రూరల్ ఎస్ఐలు నరేష్, తిరుపతి నేతృత్వంలో సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తం కేసు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఏసీపీ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
